సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55వేల మరణాల అంచనా!
ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ నిపుణులు ఒక తీవ్ర హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న సూపర్ ఎల్‌నినో వల్ల రాబోయే కొన్ని నెలల్లో భారత్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
షికాగో యూనివర్సిటీకి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన 'ఎల్‌నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్' ప్రకారం, 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి వరకు భారత్‌లో సుమారు 55 వేల మంది అదనపు హీట్ సంబంధిత మరణాలు సంభవించవచ్చు. ఈ అంచనాల్లో అత్యధిక మరణాలు మార్చి నెలలోనే నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికి వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆరు నెలల కాలంలో సుమారు 3.73 లక్షల మంది అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని ట్రాకర్ తెలిపింది.

నైజీరియాలో 56 వేలు, భారత్‌లో 55 వేలు, ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్‌లో 19 వేల మరణాలు సంభవించవచ్చని అంచనా. పసిఫిక్ మహాసముద్రం మధ్య మరియు తూర్పు భాగాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్ నినో అంటారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలు మారుతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు రాగా, మరికొన్ని చోట్ల తీవ్ర కరువు, వేడి గాలులు వీస్తాయి.
ఈసారి ఇది 'సూపర్ ఎల్‌నినో'గా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ నాటికి పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలకు పైగా పెరిగాయి.భారత్‌లో ఇప్పటికే వేసవిలో వడదెబ్బలు, హీట్‌స్ట్రోక్‌లు సాధారణం. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, బయట పని చేసే కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. తగినంత నీరు, చల్లని వాతావరణం లేకపోతే ప్రమాదం పెరుగుతుంది.నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కేవలం అంచనాలు మాత్రమే. అయితే ప్రభుత్వాలు, ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. హీట్‌యాక్షన్ ప్లాన్‌లు అమలు చేయడం, తాగునీటి సదుపాయాలు పెంచడం, వృద్ధులు, గర్భిణులు, పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం అని చెప్తున్నారు. బయట పని చేసేవారు మధ్యాహ్న వేళల్లో విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. ఇళ్లలో చల్లని వాతావరణం కల్పించుకోవాలి.
వాతావరణ మార్పులు ఇప్పుడు ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. సూపర్ ఎల్‌నినో ముప్పును తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. మార్చి వచ్చేలోపు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ అంచనాలను తగ్గించుకోవచ్చు. మరణాలను తగ్గించవచ్చు.












Click it and Unblock the Notifications
