సూపర్‌స్టార్ కృష్ణ లెజెండరీ: పీఎం మోడీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు చెప్పిందిదే!!

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. అటు సినిమా ప్రపంచాన్ని ఇటు రాజకీయ ప్రముఖులను ఆయన మృతి కలచివేసింది. సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో ప్రముఖులు స్పందిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

బహుముఖ నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ: పీఎం మోడీ

కృష్ణ గారు తన బహుముఖ నటన మరియు సజీవ వ్యక్తిత్వం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ అని, సూపర్ స్టార్ అనీ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆయన మృతి సినీ, వినోద రంగానికి తీరని లోటు అని మోడీ పేర్కొన్నారు. ఈ విచారకరమైన సమయంలో తన ఆలోచనలు మహేష్ బాబు మరియు అతని కుటుంబం వెంట ఉంటాయని పేర్కొన్నారు. ఓం శాంతి అంటూ కృష్ణ ఆత్మ శాంతించాలని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్ ద్వారా
తెలిపారు.

సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు వెండితెర కౌబాయ్ గా అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ కుటుంబానికి తీరనిలోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ చిత్రాలతో , యువతులను కార్మికులను స్ఫూర్తి నింపే పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించారని, ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని తెలిపారు.

ఏ పాత్ర అయినా ఇమిడిపోయే విశిష్ట నటుడు: బండి సంజయ్

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు గారితో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగిందని, ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందానని వెల్లడించారు. అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలలో కృష్ణ గారు నటించి జీవించారని బండి సంజయ్ పేర్కొన్నారు. తన నటన ద్వారా అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేసారని గుర్తు చేశారు.ఏ పాత్ర పోషించిన ఆ వర్గం తమ నాయకుడిగా, తమ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్టమైన నటుడు అంటూ కొనియాడారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.

సినిమా రంగంలో నూతన ఒరవడిని సృష్టించారు : రేవంత్ రెడ్డి


కృష్ణ మృతి పట్ల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎంపీ డాక్టర్ కృష్ణ మృతి పట్ల స్పందించిన ఆయన సినిమా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నూతన ఒరవడిని సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ ఎంతగానో కృషి చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+