తలసాని అనర్హుడు: గవర్నర్‌ను ఆడిపోసుకున్న ఎర్రబెల్లి
హైదరాబాద్: తమ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా కొనసాగనివ్వడంపై ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను తప్పు పట్టారు.
తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి పదవికి అనర్హుడని ఆయన అన్నారు. బిఎసి సమావేశం ముగిసిన తర్వాత ఆయన టిడిఎల్పీ కార్యాలయంలో బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు. తలసాని వ్యవహారంపై గవర్నర్ మౌనం వహిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

పార్టీ ఫిరాయింపులపై మొత్తుకుంటున్నా గవర్నర్ స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. శాసనసభలో 21 అంశాలపై చర్చ జరగాలని బిఎసి సమావేశంలో ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.
పేదలకు ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా అంగీకరించారని ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు బుధవారంనాడు ప్రారంభమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications