తెలంగాణా బీజేపీ అధ్యక్షుడి మార్పు, పార్టీలో విబేధాలపై తరుణ్ చుగ్ క్లారిటీ!!
తెలంగాణ బీజేపీలో గత కొంత కాలంగా పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని, అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ బీజేపీలో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీనిపై బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణా బీజేపీ నాయకులు అందరూ ఒకే తాటిపై ఉన్నారని, తామంతా కలిసికట్టుగానే ఉన్నామని, రాష్ట్ర పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నారు తరుణ్ చుగ్. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు ఉంటుందా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను కూడా నియమించామన్నారు.

ఇక అధ్యక్షుడి మార్పు ఎక్కడిది అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తన వ్యాఖ్యల ద్వారా బండి సంజయ్ మార్పు ఉండబోదని మరోమారు తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. గతంలోనూ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను పక్కన పెడుతున్నారని చర్చ జరిగిన సమయంలో అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు తరుణ్ చుగ్.
ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో బండి సంజయ్ మార్పు వార్త బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో మరోమారు తరుణ్ చుగ్ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు తుఫాను ప్రభావం అనేక రాష్ట్రాలపై పడే అవకాశాలు ఉన్న కారణంగా నేడు జరగాల్సిన కేంద్ర మంత్రి పర్యటన వాయిదా పడిందని అన్నారు.
ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా బహిరంగ సభను కూడా వాయిదా వేశామని పేర్కొన్న ఆయన మళ్లీ అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు చేసిన తర్వాత ఖమ్మం సభకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరూ నిరాశకు గురి కావద్దని, త్వరలోనే అగ్రనేతల పర్యటన ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పని చెయ్యాలని సూచించారు.












Click it and Unblock the Notifications