'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఓటుకు నోటు కేసు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వేసవి సెలవులు ముగిసిన తర్వాత కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి తెలిపారు. జులై 24న విచారణ జరగబోతోంది.
ఈ కేసులో చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ముడిపడివున్నాయని, ఆ వివరాలను అందించడానికి తమకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరగా అప్పటికి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగడానికి అవకాశం ఉండదని, సెలవుల అనంతరం తీసుకోవాలని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు.

ఎన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపిస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడంలేదని, సీబీఐకి దర్యాప్తు కోసం ఇవ్వాలని, చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆళ్ల డిమాండ్ చేస్తున్నారు. మరో మూడు కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. మత్తయ్య, సెబాస్టియన్ కూడా సుప్రీంను ఆశ్రయించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి కూడా కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని, చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆళ్ల వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు. ఈ విషయంలో అతనిపై అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ కోవర్ట్ గా పనిచేయడానికి కాంగ్రెస్ లోకి వెళ్లారంటూ తెలుగదేశం ఆరోపించింది.












Click it and Unblock the Notifications