దృష్టంతా ఏపీపైనే: బోసిపోయిందా?, ఎన్టీఆర్ భవన్‌లో కానరాని నేతలు
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలన్నింటికి సాక్షిగా నిలిచిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్... రాష్ట్ర విభజన తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలు, కష్ట సుఖాలు చెప్పుకొనేందుకు వచ్చే కార్యకర్తలతో నిత్యం కిటకిటలాడేది.
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లోని టీటీడీపీ కార్యాలయం మాత్రం పలుకరించే నాథుడు లేక.. నిత్యం బోసిపోయి కనిపిస్తుంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏన్టీఆర్ భవన్‌ను తెలంగాణ టీడీపీ నేతలు తమ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు.

గుంటూరు పట్టణంలో ఉన్న టీడీపీ ఆఫీసుని ఏపీ ప్రధాన కార్యాలయంగా మార్చిన నేపథ్యంలో ఏపీకి చెందిన టీడీపీ నేతలు ఎవరూ ఇక్కడికి రావడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటే తప్ప తెలంగాణకు చెందిన నేతలు ట్రస్ట్ భవన్ వైపు ముఖం చూపక పోవడంతో ప్రస్తుతం ఆ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.
రాష్ట్రానికి చెందిన కొందరు టీడీపీ నేతలకు ట్రస్ట్‌భవన్‌లో టీటీడీపీ ఆఫీసు ఉందన్న సంగతే తెలియకుండా ఉంది. తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ చతికిల పడింది. తాము చేపట్టే కార్యక్రమాలపై ప్రజలు స్పందించకపోవడంతో నేతలకేం చేయాలో తోచడం లేదు.
టీడీపీకి చెందిన నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో వారిని నిలువరించేందుకు టీటీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీగా ప్రజలతో మమేకం కావాల్సిన నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే.
అయితే అందులో 12 మంది సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అందులో చేరిపోయారు. ఇక టీడీపీ తరుపున మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు ఓటుకు నోటు కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇక మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఏపీకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో చంద్రబాబు తెలంగాణను పట్టించుకోడని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన మాగంటి గోపీనాథ్ సైతం టీఆర్‌ఎస్‌లో చేరడంతో నగరంలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే వారే లేరని అంటున్నారు.












Click it and Unblock the Notifications