చైనా టు హైదరాబాద్: మైక్రోమ్యాక్స్ ఆర్అండ్‌డీ సెంటర్ రాక
మైక్రోమాక్స్ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ సెంటర్)ను ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌తో ఆకర్షితమైన ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్(భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్) హైదరాబాద్‌లో తన పరిశోధనా అభివృద్ధి కేంద్రం ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. మైక్రోమాక్స్ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ సెంటర్)ను ఏర్పాటు చేయనుంది.
ప్రస్తుతం చైనా దేశంలో ఉన్న ఈ కేంద్రాన్ని ఇక్కడికి తరలించనుంది. రూ. 120 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో నిర్మించే ఈ తరహా మొట్టమొదటి కేంద్రంలో భారీఎత్తున స్థానిక సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై మైక్రోమాక్స్ భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థకు ఎకరం భూమిని కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మైక్రోమాక్స్ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని ఎలక్ట్రానిక్ సిటీ (పాత ఫ్యాబ్‌సిటీ)లో 80 ఎకరాల్లో తమ పరిశ్రమను ప్రారంభించింది. నెలకు పది లక్షల సెల్‌ఫోన్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఇందులో 800 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం పరికరాలను దిగుమతి చేసుకుంటున్న సంస్థ ఇకపై ఇక్కడే ఆకృతుల(డిజైన్లు)ను రూపొందించి, వాటిని సొంతంగా తయారు చేయాలని, కొత్త ఆవిష్కరణలు జరపాలని భావిస్తోంది. కాగా, ఆర్‌అండ్‌డీ కేంద్రం నిర్మాణ పనులను ఆరు నెలల్లో చేపట్టాలని, రెండేళ్లలోపు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
హైదరాబాద్‌లో ఈ సంస్థ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 15 రోజుల్లోనే అనుమతినిచ్చింది. దీంతో ఆశ్చర్యానికి గురైన సంస్థ యాజమాన్యం.. టీఎస్‌ఐపాస్ విధానాన్ని, సీఎం కే చంద్రశేఖర్‌రావును అభినందిస్తూ లేఖ రాసింది. ఇతర రాష్ట్రాల్లో యూనిట్ల స్థాపనకు అవసరమైన అనుమతి రావడానికి 8 నెలలు పడితే ఇక్కడ పక్షం రోజుల్లోనే అనుమతి రావడంతో ఆరు నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించామని సగర్వంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటుచేయాలని మైక్రోమ్యాక్స్ నిర్ణయించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications