ఉక్రెయిన్‌లో తెలంగాణ, తమిళనాడు విద్యార్థులు: కీలక ప్రకటన చేసిన కేటీఆర్, స్టాలిన్
హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ఆరంభమైంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు చూస్తోంటే ఉక్రెయిన్‌ను తన దారికి తెచ్చుకునేంత వరకూ యుద్ధాన్ని కొనసాగించేలా ఉన్నారు. దీనికి అనుగుణంగానే రెండో రోజూ తన దాడుల తీవ్రతను రష్యా మరింత పెంచింది. రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది. రష్యా సైనికులు కీవ్‌ను చుట్టుముట్టారు. వారిని నిలువరించడానికి ఉక్రెయిన్ బలగాలు శ్రమిస్తోన్నాయి. ధీటుగా బదులిస్తోన్నాయి.

కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు..
ఈ పరిస్థితుల్లో కీవ్ సహా పలు నగరాల్లో వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. యుద్ధం ఆరంభమైన తరువాత వారందరినీ స్వదేశానికి తీసుకుని రావడం కష్టతరమైంది. ఉక్రెయిన్ ప్రభుత్వం.. తన గగన తలాన్ని మూసివేసింది. పౌర విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వట్లేదు. కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రష్యన్ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి.

ముందే హెచ్చరికలు..
యుద్ధం ఆరంభం కావడానికి ముందే- ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు విద్యార్థులు, తమదేశ పౌరులకు హెచ్చరికలను జారీ చేస్తూ వచ్చారు. యుద్ధం అనివార్యం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని, వీలైనంత త్వరగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ సూచనలను జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఎయిరిండియా కూడా ప్రత్యేక విమానాలను నడిపించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కీవ్‌కు ఏడు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎయిరిండియా సర్వీసులు అర్ధాంతరంగా..
రెండు విమాన సర్వీసులను మాత్రమే నడిపించగలిగింది ఎయిరిండియా. 500 మందికి పైగా భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తీసుకుని రాగలిగింది. ఈ లోపే రష్యా- ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడంతో ఈ తరలింపు కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఫలితంగా- వేలాదిమంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావాలంటూ కేంద్ర ప్రభుత్వం, రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేస్తోన్నారు.

తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు..
ఇలా అక్కడ చిక్కుకుపోయిన వారిలో తెలంగాణ, తమిళనాడు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకుని రావడానికి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వం తక్షణ కార్యాచరణలోకి దిగాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్- విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. తమ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను సురక్షితంగా తీసుకుని రావడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరిస్తాయని స్పష్టం చేశారు.

ఐఎఎస్ అధికారిణి సారథ్యంలో..
ఉక్రెయిన్‌లో అయిదువేల మందికి పైగా తమిళనాడు విద్యార్థులు చిక్కుకుని ఉన్నారని స్టాలిన్ చెప్పారు. ఈ ఉదయం 10 గంటల వరకు 916 మంది విద్యార్థులు ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలిపారు. వారికి సమగ్రమైన వివరాలను అందజేయడానికి, సహాయ సహకారాలను అందజేయడానికి హెల్ప్ సెంటర్‌ను నెలకొల్పామని వివరించారు.
ఐఎఎస్ అధికారిణి జసింత లాజరస్‌కు ఈ సెంటర్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు చెప్పారు. తమ రాష్ట్ర విద్యార్థులు 9445869848, 9600023645, 9940256444, 044-28515288 నంబర్లకు సంప్రదించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. వారిని తీసుకుని రావడానికి అవసరమైన ఖర్చును భరిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications