కేసీఆర్.. శంఖారావం: రేపు మరో జిల్లాలో..!!
నాగర్‌కర్నూల్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు నాగర్‌కర్నూల్‌లో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్‌లో 52 కోట్ల రూపాయల వ్యయంతో కలెక్టరేట్, 35 కోట్ల రూపాయలతో ఎస్పీ కార్యాలయ భవన సముదాయాలను నిర్మించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో అవి నిర్మితం అయ్యాయి.

అనంతరం మెడికల్ కాలేజీ, బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్. సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా నాయకులు చురుగ్గా పని చేస్తోన్నారు. లక్షమందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరలింపు కోసం సమాయాత్తమౌతోన్నారు.
అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ ఇదివరకే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ముందస్తుకు వెళ్లదలచుకోలేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టామనీ అన్నారు. అక్టోబర్ 2023 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చనే సంకేతాలు ఇచ్చారు.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించారు. ఈ ఆరు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, బహిరంగ సభల్లో ప్రసంగించడం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు కేసీఆర్. దానికి అనుగుణంగా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు.












Click it and Unblock the Notifications