పోలీసులు సునీతా లక్ష్నారెడ్డి చీర లాగారా? క్లారిటీ ఇచ్చిన డీసీపీ శిల్పవల్లి
అసెంబ్లీ సమావేశాల తొలినాడు సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి అనుమతించకుండా అడ్డుకున్న విషయంపై ఆమె స్పష్టత ఇచ్చారు.
టీ షర్ట్ లపై రాసిన అభ్యంతరకర పదాల కారణంగా అడ్డుకున్నామన్న డీసీపీ
నల్ల టీ-షర్టులు ధరించి వచ్చిన బీఆర్ఎస్ సభ్యుల దుస్తులపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉన్నాయని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నల్ల టీ-షర్టులు ధరించడం నేరం కాదని, కానీ వాటిపై ఉన్న అసభ్య పదాల కారణంగా అడ్డుకున్నామని వివరించారు. వారిని గేట్ నంబర్ 3 నుంచి అదుపులోకి తీసుకుని బీఆర్ఎస్ భవన్‌కు తరలించామని చెప్పారు.

సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారన్నది అవాస్తవం
పోలీసులు బీఆర్ఎస్ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించలేదని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా అసభ్య ప్రవర్తన జరిగితే వీడియోలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన సూచనల మేరకు తాము వ్యవహరిస్తున్నామని, మేం మా డ్యూటీ మాత్రమే చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారనే ఆరోపణలపై స్పందిస్తూ, అలాంటిది ఏమీ జరగలేదని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. వీడియోలు చూసి నిర్ధారించుకోవచ్చని అన్నారు
హరీష్ రావు టీ-షర్టు విప్పి బనియన్‌తో నిరసన
బనియన్ ధరించి అసెంబ్లీలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యమని ఆరోపిస్తూ నల్ల టీ-షర్టులు, నల్ల చీరలు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. హరీష్ రావు, అనిల్ జాదవ్ టీ-షర్టులు విప్పి బనియన్‌తో నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తెలంగాణా భవన్ కు తరలింపు
హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరపడం ఏమిటని ప్రశ్నించారు.కేటీఆర్‌తో పాటు మరికొందరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. తోపులాటలో కేటీఆర్‌కు స్వల్ప గాయమైందని, ఆయన చికిత్స తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కిందపడిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
