వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలో 20 జిల్లాల్లో దబిడి దిబిడే..
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రోడ్లపైకి వరద నీరు చేరే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని చెప్పారు.

అలాగే విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లను వెంటనే తొలగించి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించి, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications