Telangana: కేబినెట్ విస్తరణ లేనట్లే! అరెస్టులపై తేల్చేసిన సీఎం రేవంత్
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాను ఎవరి పేరును కూడా ప్రతిపాదించడం లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. త్వరగా అరెస్ట్ చేయించి జైలులో వేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే కులగణన చేశామని చెప్పారు. కులగణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారని తెలిపారు.

కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందన్నారు సీఎం రేవంత్. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందన్నారు. దీనిపై ఒకటిరెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ తాను కోరలేదని ఆయన తెలిపారు. రాహుల్‌తో తన అనుబంధంపై తెలియనివాళ్లు మాట్లాడితే తనకేంటి? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయని సీఎం రేవంత్ చెప్పారు. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటానని తెలిపారు. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవన్నారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమని అన్నారు. పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసన్నారు సీఎం రేవంత్. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ అన్నారు.
సీఎం సహా కీలక నేతల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావించారు. కొందరైతే తమకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో వారంతా కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, కేబినెట్ విస్తరణ పూర్తయితే చోటు దక్కని నేతలు అసంతృప్తికి గురవుతారని, వారి ఆశలు సజీవంగా ఉంచేందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉండటంతో కేబినెట్ విస్తరణ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications