హైదరాబాద్ షట్ డౌన్..? సాయంత్రం కేబినెట్ భేటీ.. అసెంబ్లీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్‌ను కూడా భయపెడుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. దీనిపై హైలెవల్ కమిటీని నియమించామని.. అలాగే ఈ సాయంత్రానికి కేబినెట్ సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రజలకు కీలక ప్రకటన చేస్తామని తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యలపై కేసీఆర్
పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటక,భువనేశ్వర్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారని కేసీఆర్ గుర్తుచేశారు. ముంబై,భువనేశ్వర్,బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించారని.. హైదరాబాద్ నగరం విషయంలోనూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైతే హైదరాబాద్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదని.. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే హైలెవల్ కమిటీని నియమించామని.. సాయంత్రం కేబినెట్ కూడా సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై స్పెషల్ ఫోకస్
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 65 మందికి కరోనా సోకిందన్నారు. అందులో 17 మంది విదేశీయులు ఉన్నారని చెప్పారు. కరోనా సోకినవారిలో 10 మంది కోలుకున్నారని.. హైదరాబాద్‌లోనూ ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు తెలిపారు. తాజాగా ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలిందని.. మరో రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. వారి శాంపిల్స్‌ను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామన్నారు.అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ ప్రత్యేకంగా 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతీరోజూ 500 జాతీయ,అంతర్జాతీయ విమానాలు ద్వారా 50వేల మంది ప్రయాణికులు శంషాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. వారందరికీ అక్కడే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి.. కరోనా లక్షణాలు కనిపిస్తే అంబులెన్సులో గాంధీ ఆసుపత్రికి తరలించి 14 రోజుల పాటు మెడికల్ అబ్జర్వేషన్‌లో పెడుతున్నామని చెప్పారు.

అప్పట్లో స్పానిష్ ఫ్లూ..
ప్రతీ 100 లేదా 70 ఏళ్లకు ఏదో ఒక వైరస్ రూపంలో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుందని కేసీఆర్ చెప్పారు. గతంలో 1890లో స్పానిష్ ఫ్లూ వైరస్ సోకి ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 12 కోట్ల మంది చనిపోయారని అన్నారు. అయితే మరణాల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. 20 కోట్ల మంది వరకు చనిపోయారన్న వాదన కూడా ఉందని చెప్పారు. అప్పటి రిపోర్ట్స్ ప్రకారం.. స్పానిష్ ఫ్లూ కారణంగా భారత్‌లోనూ 1కోటి 4లక్షల మంది మృతి చెందారని తెలిపారు. ముంబై డాక్ యార్డ్ నుంచి అప్పట్లో ఆ వైరస్ విస్తరించినట్టుగా నిర్దారించాన్నారు.

హైదరాబాద్ షట్ డౌన్ చేస్తారా..?
కరోనాపై ముందస్తు చర్యల్లో భాగంగా నియమించిన హైలెవల్ కమిటీ సమావేశం కొనసాగుతోందని.. మధ్యాహ్నానికి దానిపై ఒక స్పష్టత వస్తుందని కేసీఆర్ చెప్పారు. సీనియర్ సెక్రటరీలు,పంచాయితీరాజ్,విద్యాశాఖ,ట్రాన్స్‌పోర్ట్, ఇతర శాఖల సెక్రటరీలంతా అందులో పాల్గొంటారని చెప్పారు. స్కూళ్లు,కాలేజీలు,మాల్స్,థియేటర్స్ వంటి వాటిని మూసివేయాలా.. పబ్లిక్ ఫంక్షన్లు,ఈవెంట్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై ఇందులో చర్చిస్తారని చెప్పారు. హైలెవల్ కమిటీ చర్చల సారాంశంతో కేబినెట్ మీటింగ్ నిర్వహించి తదుపరి చర్యలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని.. అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడమని తెలిపారు. సాయంత్రం కేబినెట్ సమావేశం నేపథ్యంలో ముంబై,బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ను కూడా షట్ డౌన్ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications