మన స్టార్టప్ చరిత్ర లిఖించింది: కేటీఆర్‌ను మెచ్చుకున్న కేసీఆర్
హైదరాబాద్: ఉపగ్రహాలను నింగిలోకి పంపిన 'ధృవ' స్పేస్ టెక్ సంస్థను అభినందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధృవ స్పేస్ టెక్ సంస్థ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే.
ఇస్రో ప్రయోగం.. స్టార్టప్‌లపై కేసీఆర్ హర్షం
శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల బరువుగల ఓషన్ శాట్-3 (ఈవోఎస్-06) ఉపగ్రహంతోపాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకువెళ్లింది. ఓషన్ శాట్‌తోపాటు భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ దేశపు ఉపగ్రహం భూటాన్‌శాట్, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ తయారుచేసిన నాలుగు అస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను, బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ రూపొందించిన ఆనంద్ శాట్‌ను నింగిలోకి పంపారు. అంతేగాక, హైదరాబాద్‌కు చెందిన ధృవ సంస్థ రూపొందించిన థైబోల్ట్ శాట్-1, థైబోల్ట్ శాట్-2 ఉపగ్రహాలున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ కీర్తిని పెంచాయంటూ కేసీఆర్ ప్రశంసలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీహబ్‌లో సభ్య సంస్థ స్కైరూట్ ఇటీవల ప్రయోగించిన విక్రమ్-ఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా దేశ ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ మొట్ట మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందన్నారు కేసీఆర్. తాజా ప్రయోగాలతో స్టార్టప్ సంస్థల నగరంగా పేరొందిన హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగిందన్నారు. భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్ స్టార్టప్ సంస్థలు ద్వారాలు తెరిచాయని, ప్రపంచ స్పేస్ ఎకానమీలో విక్రమ్-ఎస్, తైబోల్డ్-1, తైబోల్ట్-2 ప్రయోగాలు శుభారంభం చేశాయన్నారు. ఈ రెండు ఉపగ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయన్నారు.
కేటీఆర్‌ను అభినందించిన కేసీఆర్
ఔత్సాహికుల్లో ప్రతిభ, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో టీ హబ్ భవిష్యత్‌లో మరెన్నో మైలురాళ్లు సాధిస్తాయని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు ఇది ఆరంభమన్న కేసీఆర్.. 'స్కైరూట్', 'ధ్రువ' స్పేస్ స్టార్టప్‌ల సంస్థల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యువత తమ మేధస్సును దేశాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి తమ ప్రతిభ చాటుతూ దేశకీర్తిని ఇనుమడింప చేసేందుకు యువతకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో యువత ప్రతిభను వెలికి తీసేందుకు కృషిచేస్తున్న ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు, టీహబ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.