కడియం రాజీనామా: వరంగల్ లోక్‌సభకు ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి గురువారం తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్ లోక్‌సభ స్ధానానికి అభ్యర్ధి ఎవరన్నది టీఆర్ఎస్ పార్టీలో చర్చ మొదలైంది. తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేసిన టి. రాజయ్య అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో కడియం శ్రీహరికి మంత్రి పదవికి దక్కింది.
తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు సమర్పించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సామాజికవర్గంలో పేరున్న నేతలు వరంగల్ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు.

టీర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో, నివేదికలు కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉండటంతో చాలా మంది నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతల్లో కూడా ఎవరిని రంగంలోకి దించాలనే దానిపై కసరత్తు జరుగుతోందని సమాచారం.
ఈ నేపథ్యంలో వరంగల్‌కు చెందిన పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పసునూరి దయాకర్, ప్రోఫెసర్ సాంబయ్యలు రేసులో ఉన్నట్లు తెలుస్తంది. వీరితో పాటు ప్రైవేటు విద్యాసంస్ధల అధినేత పరంజ్యోతి, తెలంగాణ డాక్టర్స్ ఐకాస నేత డాక్టర్ రమేశ్ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications