భద్రాద్రి కొత్తగూడెంలో నువ్వా నేనా.. సింగరేణి ఓటర్లే కీలకం!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో తాజా పరిస్థితి కాక రేపుతుంది. సిరుల మాగాణి సింగరేణి పుట్టినిల్లుగా, శ్రీరాముడు నడయాడిన దక్షిణ అయోధ్యగా, మన్యం జిల్లాగా ప్రత్యేకత సంతరించుకుంది.
తలలు పండిన నాయకులు తలపడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం నియోజకవర్గంలో ఒకప్పటి ప్రత్యర్థులు కలవడం, అలాగే ఒకప్పుడు కలసి ఉన్న నాయకులు ప్రత్యర్థులుగా పోటీ చేయడం వంటి పరిణామాలతో కొత్తగూడెం నియోజక వర్గం ఎన్నికల ముఖచిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

2018 ఎన్నికలలో వనమా వెంకటేశ్వరావు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కించుకుని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ దక్కని ఎడవల్లి కృష్ణ సి పి ఎం బలపర్చిన బి ఎస్ పి తరపున పోటీ చేశారు. బి ఆర్ ఎస్ నుంచి జలగం వెంకటరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బి ఆర్ ఎస్ లో చేరారు.
ఇప్పుడు అధికార బి ఆర్ ఎస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి గా కూనమనేని సాంబశివరావు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జలగం వెంకట్రావు, బిజెపి తో పొత్తు తో జనసేన నుంచి లక్కినేని సురేందర్ రావు, బి ఎస్ పి నుంచి ఎర్ర కామేష్ సహా 30 మంది అభ్యర్థులు కొత్తగూడెం బరిలో ఉన్నారు.
స్థానికులకే ఓటు వేయాలని, ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, స్థానికత ఆధారంగా తనను గెలిపించాలని బి ఆర్ ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్తున్నారు. అయితే అసమ్మతి సెగలు, స్థానిక కౌన్సిలర్ ల అలకలు వనమాకు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి.
ఇక పొత్తులో భాగంగా కాంగ్రెస్ సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన కూనంనేనికి కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దగా సహకారం అందటం లేదన్న భావన ఉంది. ఇక చాలా కాలంపాటు రాజకీయాలలో సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని ప్రచారం చేస్తున్నారు.
తనకు అవకాశం ఇవ్వాలని ఆయన అంటున్నారు. పోడు భూములపై హక్కు పట్టాల కోసం గిరిజనుల డిమాండ్, పట్టణం మధ్యలో వర్షం వస్తే రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న లో లెవెల్ వంతెన స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరి ఈ ఎన్నికల్లో కొత్తగూడెం వాసులు ఎవరికి పట్టం కడతారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications