రైతులకు కీలక అలెర్ట్... ఆ స్కీమ్ రావాలంటే ఈనెల10వ తేదీలోగా నమోదు చేసుకోవాలి!
తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం కీలక అలెర్ట్ ఇస్తుంది. రాష్ట్రంలో వర్షాకాలం సీజన్‌లో సన్న రకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనున్నట్లు ప్రకటించింది. అయితే రైతులు ఈ ప్రయోజనం పొందాలంటే తమ పంట సాగు వివరాలను తప్పనిసరిగా టీ-ఆగ్రిసీడ్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియకు సెప్టెంబర్ 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు.
సన్నరకం వరి సాగు చేసిన రైతులు నమోదు తప్పనిసరి
గడువు ముగిసిన తర్వాత నమోదుకు అవకాశం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. విత్తనాలను ఫెర్టిలైజర్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత డీలర్లే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో జిల్లాల్లో విత్తన డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు పనులను వేగవంతం చేస్తున్నారు. అయితే సొంతంగా భద్రపరచుకున్న విత్తనాలతో సాగు చేసిన రైతులు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ రకాలు సాగు చేస్తేనే బోనస్
వారు మండల వ్యవసాయ అధికారులకు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి. దానిలో ఏ రకం సన్న వరిని, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో వివరాలు పేర్కొనాలి. స్వీయప్రకటన లేకపోతే బోనస్‌కు అర్హత కోల్పోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన నిర్దిష్ట సన్నరకాల వరికి మాత్రమే ఈ రూ.500 బోనస్ వర్తిస్తుంది. అందులో KNM-1638, HMT (సోనా), RNR-15048, సాంబమసూరి, జై శ్రీరామ్, WGL-44, KNM-118, KNM-7715 రకాలు ఉన్నాయి.
గుర్తింపు లేని వరి రకాలు సాగు చేస్తే నో బోనస్
ప్రభుత్వం అధికారికంగా నిర్దేశించిన అర్హత రకాల జాబితాను రైతులు అనుసరించాల్సి ఉంటుంది. గుర్తింపు లేని ఇతర రకాల వరిని సాగు చేసిన రైతులకు ఈ లబ్ధి వర్తించదు.
నమోదు కోసం ఆధార్ వివరాలు, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు రసీదు వంటి పత్రాలు అవసరం. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాతే రైతు బోనస్‌కు అర్హత సాధించగలరు.
10వ తేదీ లోపు వివరాలు నమోదు చేసుకున్న రైతులే ఈ బోనస్ పథకానికి అర్హులు
రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను లేదా సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కూడా కోరారు. 10వ తేదీ లోపు వివరాలు నమోదు చేసుకున్న రైతులే ఈ బోనస్ పథకానికి అర్హులు













Click it and Unblock the Notifications
