దసరా పండుగ వేళ అటవీ శాఖ కీలక హెచ్చరిక!
దసరా పండుగ సమీపిస్తున్న వేళ తెలంగాణ అటవీ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట విషయంలో కీలక ప్రకటన చేసింది. పాలపిట్టను పంజరాల్లో బంధించి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ స్పష్టం చేశారు. దసరా రోజున పాలపిట్టను చూడటం శుభప్రదమని చాలామంది నమ్ముతారు.
ఈ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని కొందరు వేటగాళ్లు పక్షులను పట్టుకుని ఆలయాల దగ్గర, ఇతర ప్రదేశాల్లో ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ పద్ధతిని ఆపాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో వినయ్ కుమార్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థల నుంచి సూచనలు తీసుకున్నారు. త్వరలో మరో 20 శాఖలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి సమన్వయం చేసుకుంటామని ఆయన తెలిపారు.దేవాదాయ శాఖ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఇతర సంబంధిత వర్గాలను కూడా భాగస్వాములను చేసి పాలపిట్టల వేటను పూర్తిగా నిలిపివేయాలని ప్రణాళిక వేస్తున్నారు.గత దసరా సమయంలో సుమారు 28 పాలపిట్టలను రక్షించి తిరిగి అడవిలో వదిలిపెట్టినట్లు వినయ్ కుమార్ చెప్పారు.
పంజరంలో ఉంచడం వల్ల పక్షులకు ఒత్తిడి ఏర్పడి సరిగ్గా ఆహారం తీసుకోలేక మరణించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పక్షిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దేవాదాయ శాఖ అధికారులు కూడా ఆలయ ఉత్సవాల్లో పాలపిట్టలను ప్రదర్శించకుండా చూడాలని వినయ్ కుమార్ కోరారు. అదే సమయంలో చైనా మాంజా విక్రయాలను అరికట్టాలని కూడా చెప్పారు. ఈ మాంజా పక్షులకు, ప్రజలకు కూడా ప్రమాదకరం అని పేర్కొన్నారు. కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని, ఎన్‌జీటీ నిషేధం ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.
దసరా రోజున పాలపిట్టను చూస్తే ఆ ఏడాది మంచి జరుగుతుందని ప్రజల్లో నమ్మకం ఉంది. శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను చూశాడని, ఆ తర్వాతే విజయం సాధించాడని చెబుతారు. తెలంగాణలో దసరా రోజున జమ్మి ఆకులు పూజించడం, పాలపిట్టను చూడటం ఆనవాయితీ. గతంలో పొలాల్లో, చెట్ల మీద సహజంగా కనిపించేది. ఇప్పుడు గ్రామాల్లో కూడా అరుదుగా మారింది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు పక్షులను బంధించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి చర్యలపై అధికారులు గత కొన్నేళ్లుగా చర్యలు తీసుకుంటున్నారు.పాలపిట్ట రాష్ట్ర పక్షి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అటవీ శాఖ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించనుంది.












Click it and Unblock the Notifications
