సమైక్య ఏపీ మైనస్: తెలంగాణకు ఏ గ్రేడ్ ఆర్థిక శక్తిగా ఇక్రా రేటింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఉమ్మడి ఏపీ మైనస్ కేటగిరిలో ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్లస్‌లోకి వచ్చిందని పేర్కొంది.
జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలను పొంది, వాటిని తిరిగి చెల్లించే సందర్భంలో ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని ఇక్రా లెక్కగట్టి వెల్లడిస్తుందని, ఈ ఏడాది వెల్లడించిన రేటింగ్ జాబితాలో తెలంగాణ సామర్థ్యాన్ని పేర్కొందని వివరించింది.
దేశంలోని ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన ఇక్రా... మిగిలిన వాటితో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడించిందని తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందే సందర్భంలో, రుణాలను చెల్లించగల స్తోమత విషయంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని లెక్కగడుతుంది.

ఈ ఏడాది ఇక్రా వెల్లడించిన రేటింగ్ జాబితాలో తెలంగాణను ఏ క్యాటగిరీ ఆర్థిక వ్యవస్థగా వెల్లడించింది. తన అధ్యయనంలో తేలిన ఆరు సానుకూల అంశాలను కూడా నివేదికలో ప్రస్తావించింది.
మొదటిది... పన్నుల ద్వారా సమకూరే ఆదాయం తెలంగాణలో మెరుగ్గా ఉంది. రెండోది.. దేశ తలసరి ఆదాయం రూ.74,380. కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.95,361. మూడోది... తెలంగాణ రాష్ట్రం ఇటీవల తెచ్చిన టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించి, రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోనుంది.
నాలుగోది... ఇతర రాష్ర్టాలతో పోలిస్తే.. పెట్టుబడి వ్యయంలో రుణం వాటా చాలా తక్కువగా ఉంది.ఐదవది... వివిధ కార్యక్రమాలకు సార్థక పెట్టబడులు ఉన్నాయి. ఆరోది.. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఖర్చుచేయడం వల్ల వ్యవసాయరంగం పరిస్థితి మెరుగవుతుంది.
పై అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్రా తెలంగాణ రాష్ర్టాన్ని ఏ క్యాటగిరీ రాష్ట్రంగా ప్రకటించింది. ఈ రేటింగ్‌తో తెలంగాణ రాష్ర్టానికి దేశ, విదేశాల్లో పరపతి పెరుగుతుంది.
రుణాల లభ్యత సులభమవుతుంది. రేటింగ్ తక్కువ వస్తే చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మెరుగైన రేటింగ్ వస్తే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ఇక్రా రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.












Click it and Unblock the Notifications