తెలంగాణలో తొలి విడతలో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి, టెట్‌కు కూడా
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. మొత్తం 80,039 పోస్టులకుగాను.. తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఇవాళ ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.

తెలంగాణలో తొలి విడతలో 30వేలకుపైగా ఉద్యోగాల భర్తీ
ఈ మేరకు తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. గ్రూప్-1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాల్లోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సంబంధిత శాఖల్లో భర్తీ ప్రక్రియను నియాకమక సంస్థలు చేపట్టనున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి, మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేయనుంది.

పోలీసు శాఖలోనే అత్యధిక ఉద్యోగాల, టెట్ కూడా త్వరలో
గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది. పోలీసు నియామక సంస్థ ద్వారా జైళ్ల శాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టుల భర్తీ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా జైళ్ల శాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్-42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారి-20, వాణిజ్య పన్నుల శాఖలో 48, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ మేరకు టెట్ పరీక్ష కూడా త్వరలో నిర్వహించనున్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం
ఇటీవల శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసందే. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ శాసన సభలో ఆదేశించారు. అయితే.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తొలి విడతగా 30వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.












Click it and Unblock the Notifications