టోల్ గేట్ ఛార్జీలు లేనట్లే..! సర్కార్ నిర్ణయం.. కొన్నిచోట్ల "పైసా వసూల్"
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ తేదీ) నాడు టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేయరు. జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్ల దగ్గర వాహనాలకు టోల్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి. దీంతో పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లేవారికి ఊరట లభించినట్లైంది. ఛార్జీలు వసూలు చేయడానికి ఒక్కో వాహనానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో టోల్ గేట్ల దగ్గర వీపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీని కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు జాతీయ రహదారులపై గంటలకొద్దీ నిలిచిపోవాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పండుగ సందర్భంగా జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. శనివారం నాడు హైదరాబాద్ - విజయవాడ రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపించాయి. వీకెండ్ కావడం, సెలవులు కలిసిరావడంతో చాలామంది స్వస్థలానికి బయలుదేరడంతో వీపరితీమైన రద్దీ కనిపించింది. ఇక టోల్ గేట్ల దగ్గర పరిస్థితి మరీ దారుణం. టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేయడానికి ఒక్కో వాహనానికి చాలా సమయం తీసుకోవడంతో.. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అటు యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర కూడా వాహనాలు క్యూ కట్టాయి. అటు కరీంనగర్, నిజామాబాద్ రూట్లలోనూ ఇదే పరిస్థితి.

అదలావుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పరిగణనలోకి తీసుకోబోమని.. కేవలం కేంద్రం ఆదేశాలను మాత్రమే అమలు చేస్తామంటున్నారట. దీంతో వాహనదారులకు, టోల్ గేట్ల సిబ్బందికి మధ్య వాగ్వావాదాలు జరుగుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications