తెలంగాణలో అమల్లోకి భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..? భూ భారతి కొత్త రూల్స్ తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్‌ ప్రారంభమైంది. భూ భారతి పోర్టల్‌ను హైదరాబాద్​ శిల్పకళా వేదికలో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటా పూర్‌ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. జూన్‌ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మనిషికి ఆధార్.. భూమికి భూ దార్..

భూ భారతి పోర్టల్ ఆవిష్కరణ తర్వాత సీఎం రేవంత్ ప్రసగించారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భూ భారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని తెలిపారు. "మనిషికి ఆధార్ ఎట్లనో.. ప్రతి ఒక్కరి భూమికీ భూధార్ తెస్తం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి, హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడ్తం" అని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదరహిత భూ విధానం ఉండేలా చేస్తామన్నారు.

Telangana government Launches Bhu Bharati Portal complete details about Bhu Bharati Act

భూ భారతి vs ధరణి మార్పులు ఇవే

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బాంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అధికారంలోకి రాగానే అన్నంత పని చేశారు. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చారు. మరి ధరణికి భూ భారతి కి మధ్య తేడాలేంటి?

అనభవదారు కాలమ్ ధరణిలో రద్దు చేశారు. కానీ భూ భారతిలో అనుభవ దారు కాలమ్ కు చోటు కల్పించారు. ధరణిలో పార్ట్- బీ(వివాదాస్పద భూములు) జాబితాకు పరిష్కారం లేదు. భూ భారతిలో వివాదాస్పద భూములకు పరిష్కారం ఉంది. ధరణిలో భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారాలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు. కానీ భూ భారతిలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు అధికారాలు అప్పజెప్పారు. ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలుకు అవకాశం లేదు. సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందే. కానీ భూ భారతిలో అప్పీల్ అవకాశం ఉంది. రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇక ధరణి రికార్డు శాశ్వతం. కానీ భూ భారతిలో భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమికి, రికార్డుకు మధ్య లింకు కలుపుతారు.

ధరణిలో భూముల రిజిస్ట్రేషన్, వెంటనే మ్యుటేషన్ జరిగేది. కానీ భూ భారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్, వెంటనే మ్యుటేషన్, ఆ తర్వాత ఏ మేరకు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ ఇవ్వనున్నారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీల్ కు అవకాశం లేదు. భూ భారతిలో వారసత్వంగా దక్కిన భూములను విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారసులందరికీ నోటీసులు జారీ చేసి, అభ్యంతరాల అనంతరమే రికార్డుల్లో వివరాలు నమోదు(మ్యుటేషన్) చేస్తారు.

ధరణిలో అసైన్డ్ భూములకు పట్టాదార్ పాసు పుస్తకం లేదు. 13బీ, 38ఈ లకు పాస్ పుస్తకాలు పొందే అవకాశం లేదు. అయితే భూ భారతి చట్టంలో అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఆర్డీఓ విచారణ అనంతరం పాసు పుస్తకం లభించనుంది. ధరణిలో లేని మరో అంశం ఏంటంటే ప్రతి రైతుకి ఆధార్ లాగానే భూ ధార్ ఇస్తారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రైబ్యునల్ ఏర్పాటు జరగనుంది.

భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభించనుంది. ధరణిలో రికార్డుల్లో తప్పులు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లడం ఒక్కటే పరిష్కారం. కానీ భూ భారతి చట్టంలో జిల్లా స్థాయిలో రెండు అంచెల అప్పీలు వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రైబ్యునల్ ఏర్పాటు జరగనుంది. భూ సమస్యలకు జిల్లా స్థాయిలోనే పరిష్కారం జరగనుంది.

ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు అయింది. కానీ భూ భారతిలో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీలు చేసుకోలేని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్దరణ, ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారిలాగా గ్రామ ప్రజాపాలన అధికారి నియామకం జరుగుతుంది. భూ భారతి చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్ పై కఠిన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించనుంది.

భూ భారతి చట్టం రూల్స్..

1. ధరణి స్థానంలో కొత్తగా భూమి హక్కుల రికార్డు (ఆర్ ఓ ఆర్) రూపొందించవచ్చు.

2. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ధరణిలో తప్పులను సవరించవచ్చు.

3. ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు రూపొందించవచ్చు.

4. ధరణిలో తప్పుల సవరణ కోసం దరఖాస్తులు స్వీకరించి రికార్డు సరి చేయవచ్చు.

5. భూమి పై హక్కులు ఉండి రికార్డులో లేని వారు దరఖాస్తు చేసుకునే అవకాశం. విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వవచ్చు.

6. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు మ్యాప్ తప్పనిసరి. లైసెన్సు డ్ సర్వేయర్ల ద్వారా భూముల సర్వే. గెట్టు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెల్లు చీటి.

7. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తు పరిష్కారం.

8. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ. డీమ్డ్‌ మ్యుటేషన్ కు అవకాశం.

9. భూమి హక్కులు ఏవిధంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులకు ఎక్కించే అవకాశం.

10. పాస్ పుస్తకాలలో భూమి పటం.

11. రికార్డులను పరిశీలించి తాత్కాలిక భూ ధార్ కార్డుల జారీ. దీనితో ధరణి రికార్డుల ప్రక్షాళన.

12. భూముల సర్వే చేసి కొత్త హక్కుల రికార్డు తయారీ, శాశ్వత భూ ధార్ కార్డుల జారీ.

13. ఆర్ ఓ ఆర్ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ.

14. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్స్ ఏర్పాటు.

15. రైతులకు ఉచిత న్యాయ సహాయం. ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు.

16. ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూ భారతి పేరుతో కొత్త పోర్టల్ ఏర్పాటు.

17. రెవిన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం.

18. పహాణి, ఇతర గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ.

19. ప్రభుత్వ, భూ దాన్, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములకు తప్పుగా పట్టాలు జారీ చేస్తే ఎవరైనా కంప్లైంటు ఇచ్చే అవకాశం. రికార్డులను సవరించడానికి రివిజన్ అధికారాలు.

20. మోసపూరితంగా రికార్డులు మారిస్తే అధికారుల పై చర్యలకు అవకాశం.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+