Chandrayaan-3: తెలంగాణ స్కూళ్లు, కాలేజీల్లో చంద్రయాన్ లైవ్ స్ట్రీమింగ్-విద్యాశాఖ ఆదేశాలు
చంద్రుడి నిగూఢ రహస్యాలు తెలుసుకునేందుకు జరుగుతున్న చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రష్యా ప్రయోగించిన లూనా 25 విఫలం కావడం, చంద్రయాన్ 2 వైఫల్యం తర్వాత ఇస్రో చేస్తున్న మరో ప్రయోగం చంద్రయాన్ 3 కావడంతో దీనిపై ఆసక్తి మరింత పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు ఈ ప్రయోగంపై అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ఇస్రో కోరింది. దీంతో ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి.
రేపు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత దృశ్యాన్ని తమ రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు లైవ్ ద్వారా చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ విద్యాసంస్ధలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీల్లో చంద్రయాన్ ల్యాండింగ్ దృశ్యాల్ని ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ అద్భుతాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చంద్రయాన్ ల్యాండింగ్ దృశ్యాల్ని చూపిస్తామని అధికారులు తెలిపారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ను లైవ్ లో అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులు, యువత దీనిని చూడాలని విజ్ఞప్తి చేసింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications