తెలంగాణలో అన్ని చెక్ పోస్టులు తొలగింపు.. కారణం ఇదే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణ శాఖలో ప్రధాన మార్పులు చేసింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న 14 బార్డర్ చెక్ పోస్టులను రద్దు చేసింది. అలాగే కామారెడ్డి జిల్లాలోని మరో ఆర్టీఏ చెక్ పోస్టును పూర్తిగా తొలగించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెందిన అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 28 వ తేదీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో చెక్‌పోస్టుల వద్ద జరిగే నిర్లక్ష్యం, అవినీతి వంటి సమస్యలకు చెక్ పడింది. అలాగే ఇప్పటివరకు బార్డర్ ప్రాంతాల్లో వాహనాలు ఆగి తనిఖీలు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీని వలన సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు ఆలస్యం కావడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం లాంటి సమస్యలు ఎదురయ్యేవి.

తాజా నిర్ణయంతో వాటికి చెక్ పడింది. రాష్ట్ర రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, త్వరగా వాహనదారులకు సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన ఉత్తర్వుల ప్రకారం వాహన తనిఖీల కోసం ఇకపై మొబైల్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఈ మొబైల్ స్క్వాడ్ లు వాహనాలను ఆరు నెలలకు ఒకసారి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో తనిఖీ చేస్తాయి. అలాగే రవాణా ఫీజులు, పన్నులు చెల్లించడానికి వాహనదారులకు ఆన్ లైన్ సదుపాయం కల్పించబడుతుంది. దాంతోపాటు నిబంధనల ఉల్లంఘన, రవాణా చట్టాలను ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు కూడా ఆన్ లైన్‌లో విధించబడతాయి.












Click it and Unblock the Notifications