తెలంగాణ సర్కార్ కు అరుదైన రికార్డ్ : లిమ్కా బుక్ లో 'సమగ్ర కుటుంబ సర్వే"
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సింగిల్ డే లో రాష్ట్రంలోని కోటి తొమ్మిది లక్షల కుటుంబాల సమాచారాన్ని సేకరించడం జాతీయ రికార్డుగా పేర్కొంది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ్ ఘోష్ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసి సరికొత్త పథకాలు రూపొందించడానికి ఈ ఇంటింటి సర్వే ఉపయోగపడిందని సంస్థ ప్రకటించింది. 2014, ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం ఈ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది.

ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రవేశపెట్టిన పథకాల్లో మిషన్ భగీరథ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకుంటుండగా.. దేశ ప్రధాని మోడీ చేత పలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కితాబు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకు అవార్డులు దక్కాయి. .
ప్రభుత్వానికి అందజేసిన సర్టిఫికెట్ లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విధానాన్ని క్షుణ్ణంగా పొందుపరిచింది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజమాన్యం. సమగ్ర కుటుంబ సర్వే లాంటి కార్యచరణను ఆచరణలో చేసి చూపించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషిని ప్రశంసించింది. దేశంలో మరే రాష్ట్రాలు సాహసించని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు నాలుగు లక్షల మంది ఉద్యోగులు, 1.09 కోట్ల కుటుంబాల సమాచారాన్ని సేకరించడం అసాధారణమని అభినందించింది.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా.. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తిపాస్తులు తదితర సంక్షిప్త సమాచారం మొత్తాన్ని సర్వే నమోదు చేసిందని తెలిపింది.












Click it and Unblock the Notifications