DSC: తెలంగాణలో పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, 11వేల పోస్టులతో కొత్తది
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియామకాలకు గత ఏడాది బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గత సెప్టెంబర్ నెలలో 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తాజా ప్రభుత్వం మెగా డీఎస్సీకి సిద్ధమైంది.
రేపు(గురువారం) లేదా ఎల్లుండి దాదాపు 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే గత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత డీఎస్సీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఏడాది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్టీ పరీక్షలను వాయిదా వేశారు.
కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అప్పట్లోనే చెప్పినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని పోస్టులను కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న కొత్త ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications