ఆర్నెల్లపాటు పైసా ఖర్చు లేకుండా.. మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆరోగ్యానికి భరోసా కల్పించడం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్, మహిళల ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యవేక్షణలో హెల్త్ మిషన్ 100 కార్యక్రమాన్ని రూపొందించారు.
మహిళలకు సమగ్ర వైద్య పరీక్షలు
ఈ వంద రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు సమగ్ర వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన నిర్వహించుకునే క్రమంలో, ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం ఎటువంటి ఖర్చు లేకుండా అధునాతన డయాగ్నస్టిక్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మహిళలకు నిజంగా శుభవార్త
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద మహిళలకు ఎటువంటి ఖర్చులు లేకుండా అన్ని రకాల టెస్టులు చేయడం మహిళలకు నిజంగా శుభవార్త అని చెప్పాలి. వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం మహిళల కోసం సమగ్ర వైద్యపరీక్షలు వచ్చే ఆరునెలలపాటు కొనసాగుతాయి. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల లో ఉన్న మహిళలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లబ్ధిదారులుగా చెబుతున్నారు.
ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
ప్రతి మహిళకు టీ డయాగ్నస్టిక్స్ నెట్వర్క్ ద్వారా దాదాపు 30 రకాల కీలక వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలలో సాధారణ పరీక్షలతో పాటు, ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా చేర్చారు. ఈ ప్రక్రియను నాలుగు దశలుగా విభజించి వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి మహిళకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
హెల్త్ మిషన్ 100 ద్వారా కేవలం బయట పరీక్షలను చేయడమే కాకుండా ప్రతి మహిళకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించేందుకు కూడా కృషి చేయనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వారి పూర్తి వైద్య చరిత్ర ఒకే ఒక క్లిక్ తో ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఇది సకాలంలో మెరుగైన చికిత్స అందించడానికి దోహదం చేస్తుంది.
వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యల కోసం కూడా ప్రత్యేక చర్యలు
అంతేకాదు వేసవి కాలం కావడంతో వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఈ మిషన్ లో భాగం చేశారు. వడ దెబ్బ, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఈ మిషన్ లో చేర్చి ప్రజలకు తెలియజేస్తున్నారు.
మహిళలకు ఆరోగ్య రక్షణ కోసం అనేక కీలక నిర్ణయాలు
పాలీ క్లినిక్ కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆరోగ్య రక్షణ కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications