ఆ డిగ్రీ కోర్సులలో లాస్ట్ ఇయర్ నెలకు రూ.7వేల స్టైపెండ్..జాబ్ పక్కా!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ఉపాధి కల్గించేదిగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 11 కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (AEDP) కోర్సులను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు థియరీ జ్ఞానంతో పాటు పరిశ్రమల అనుభవాన్ని పొంది, ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
విద్యార్థులకు ఉపాధి ఆధారిత డిగ్రీ కోర్సులు
కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అమలు చేయబడుతోంది. ఈ మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో చివరి సంవత్సరం విద్యార్థులు వివిధ కంపెనీలు, పరిశ్రమలు మరియు సంస్థల్లో నిజమైన ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారికి నెలకు రూ.7,000 స్టైపెండ్ కూడా అందుతుంది.

కనీసం 8 వేల సీట్లను భర్తీ చేయాలని లక్ష్యం
ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం సీట్ల సంఖ్యను 11 వేలకు పెంచింది. అయితే కనీసం 8 వేల సీట్లను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో 80-90 శాతం మందికి శిక్షణ పొందిన సంస్థల్లోనే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
94 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 27 రకాల AEDP కోర్సులు
గత సంవత్సరం 16 రకాల కోర్సుల కింద 6 వేల సీట్లు అందుబాటులో ఉండగా, కేవలం 1,770 మంది మాత్రమే చేరారు. ఈసారి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులను ఎంపిక చేసి అదనపు 5 వేల సీట్లు కలిపారు. రాష్ట్రంలోని 94 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 27 రకాల AEDP కోర్సులు అందుబాటులో ఉంటాయి.
కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులతో ఉపాధి
కొత్తగా ప్రవేశపెట్టిన 11 కోర్సుల విషయానికి వస్తే B.Sc విభాగంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్, ఈ-మొబిలిటీ & బ్యాటరీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ & IT హార్డ్‌వేర్, హార్టికల్చర్ & ల్యాండ్ స్కేపింగ్, ఫిషరీస్ & ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ & టెక్నాలజీ, డెయిరీ & పౌల్ట్రీ మేనేజ్‌మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్ & ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి.
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా ఈ కోర్సుల్లో అడ్మిషన్
B.Com విభాగంలో బిజినెస్ అనలిటిక్స్, B.A విభాగంలో యానిమేషన్ & VFX, ఫిల్మ్ మరియు టీవీ ప్రొడక్షన్.ఉంటాయి. విద్యార్థులు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా ఈ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర యువత ఉద్యోగ సిద్ధతను పెంపొందించి, భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఈ వినూత్న విధానం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించనుంది. రాబోయే రోజుల్లో ఇది తెలంగాణ విద్యా వ్యవస్థకు మైలురాయిగా నిలవనుంది.












Click it and Unblock the Notifications