రాజమండ్రిలో తొక్కిసలాట: అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంతో, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేలా ఉపక్రమించింది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి పుష్కరాలపై ఉదయం నుంచే సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
భద్రాచలం, కాళేశ్వరం, బాసర తదితర ప్రాంతాల్లో విధుల్లో ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మలతో కూడా మాట్లాడి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పుష్కర ఘాట్ల వద్ద క్యూలైన్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులు స్నానాల కోసం లోతు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో పడవలు, గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలని సీఎం చెప్పారు.

పిల్లలు, మహిళలు, వృద్దుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారు ఏలాంటి ఇబ్బంది లేకుండా పుణ్య స్నానాలు చేసే విధంగా చూడాలన్నారు. గోదావరి నదీ తీరంలోనే కాకుండా ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.
పుష్కర ఘాట్ల వద్ద, దేవాలయాల ప్రాంగణాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ చెప్పారు. పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని ఆదేశించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, అన్ని శాఖల అధికారులు పుష్కరాలు జరిగే అన్ని రోజులు కాస్త ఎక్కువ శ్రమ తీసుకుని భక్తులకు సహకరించాలని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. భద్రాచలం, కాళేశ్వరం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి, భద్రతకు మరింత ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ రెండు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, డిజిపి అనురాగ్‌శర్మలను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం వారిద్దరు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లి అక్కడి పరిస్ధితిన సమీక్షించారు.












Click it and Unblock the Notifications