ఆ ఊరంతా ఉచిత విద్యుత్.. వెలుగుల పండుగ ప్రకటించిన ప్రభుత్వం!
దేశంలో గ్రీన్ విద్యుత్ ను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. మొత్తం 75 వేల కోట్ల పెట్టుబడితో ఒక కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అమర్చి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
మోడల్ సోలార్ విలేజ్ ప్రోగ్రాం
తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడల్ సోలార్ విలేజ్ ప్రోగ్రాం కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా ఇచ్చి ప్రారంభించింది. హన్మకొండ జిల్లాలో ఆత్మకూరు గ్రామం మోడల్ సోలార్ విలేజ్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఈ క్రమంలో మోడల్ సోలార్ విలేజ్ ప్రోగ్రాం కింద ఎంపికైన హనుమకొండ జిల్లా ఆత్మకూరులో సౌర విద్యుత్ ఉత్పాదక యూనిట్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.

ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. మోడల్ సోలార్ విలేజ్ కింద ఆత్మకూరు గ్రామంలో 1171 గృహ జ్యోతి సర్వీసులకు ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామంలోని 468 వ్యవసాయ పంప్ సెట్లకు సోలార్ యూనిట్లు
గృహ అవసరాలకు సరిపడే విద్యుత్ వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్‌ను నెట్ మీటర్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం ద్వారా, వినియోగదారులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించామని వివరించారు.అదేవిధంగా గ్రామంలోని 468 వ్యవసాయ పంప్ సెట్లకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్లు అమర్చనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
ఈ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం సుమారు 48.35 కోట్ల రూపాయలు కాగా, కేంద్ర రాయితీ మినహా మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. ఇళ్ళు మరియు వ్యవసాయ పంపుసెట్లకు ఈ సదుపాయాలు ఉచితంగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా అందించబడతాయని అధికారులు తెలిపారు. ఇది నిజంగా ఆత్మకూరు గ్రామానికి వెలుగుల పండుగ అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు.సోలార్ పవర్ వ్యవస్థ గ్రామ అభివృద్ధికి, పర్యావరణ రక్షణకు కీలక పాత్ర పోషిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications