మరో ఎన్నికల హామీ అమలుకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Cast census: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కుల గణనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కులాల వారీగా సర్వే చేపట్టే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
కుల గణన.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. బిహార్ ప్రభుత్వం మొదటగా దీన్ని చేపట్టింది. అనంతరం పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కులాలవారీగా సర్వే చేపట్టాయి. తాజాగా ఏపీ కూడా ఈ జాబితాలో చేరనుంది. ప్రస్తుతం ఏపీలో కుల గణన కొనసాగుతోంది. ఆదివారం నాటితో ముగియాల్సి ఉంది.

కుల గణనను నిర్వహించే బాధ్యతను ఏపీ ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఈ కార్యక్రమం మొదలైంది. 10 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. కులగణన సమయంలో ఆయా కుటుంబాల వారి నుంచి సేకరించిన డేటాను భద్రపర్చడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.
అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో కుల గణనకు తెర తీసింది అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీన్ని మేనిఫెస్టోలనూ చేర్చింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం కుల గణన నిర్ణయానికి కట్టుబడి ఉందని అన్నారు. దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications