తెలంగాణాలో పల్లె పల్లెకూ తీపికబురు.. ఆగస్ట్ లో ఆ పథకానికి శ్రీకారం!
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్లాన్ రెడీ చేసి, త్వరలో ఈ ప్లాన్ ను అమలు చేయనుంది.
హ్యామ్ రోడ్ల కోసం పనులు .. టెండర్లు పూర్తి
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 6,703 గ్రామాలను కలుపుతూ 18472 కిలోమీటర్ల రహదారులను నిర్మాణం చేయనుంది. మొదటి దశలో 2,678 గ్రామాల్లో, 7,450 కిలోమీటర్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే లాంఛనంగా పనులు
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఆగస్టు రెండవ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌకర్యం లేని 179 మారుమూల గ్రామాలకు 934 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను వేయడానికి నిర్ణయించారు.
ఆగస్ట్ 15 నాటికి నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు
గిరిజన మారుమూల ప్రాంతాలను ఇవి ప్రధాన రహదారులతో కలుపుతాయి. పంచాయతీరాజ్ శాఖ ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతిని కోరింది. ఈ నెలాఖరు నాటికి దీనికి ఆమోదం రాగానే ఆగస్టు 15వ తేదీ నాటికి నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులు వేగంగా సాగనున్నాయి. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదం
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని, తద్వారా ప్రాంత అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాలను కలుపుతూ డబల్ రోడ్లు వేసిన తర్వాత, ఇప్పుడు గ్రామస్థాయి రోడ్ల పైన కూడా దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదం చేయనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం ఒక శుభవార్త.












Click it and Unblock the Notifications