ఈ వేసవిలో నిప్పులు కురిపించనున్న సూర్యుడు: కారణం ఇదే
తెలంగాణ రాష్ట్రంలో రానున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కురవాల్సిన వర్షం కన్నా.. 98 శాతం తక్కువగా పడటమే కారణం. ఈ మేరకు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీస్(టీఎస్ డీపీఎస్) గణాంకాలు చెబుతున్నాయి.
సాధారణంగా 4.6 ఎంఎం వర్షం కురవాల్సి ఉండంగా ఈ ఏడాది మాత్రం 0.1 మిల్లిమీటర్ల వర్షపాతమే నమోదైంది. గత సంవత్సరం ఈ రెండు నెలల్లో ఏకంగా 35.9 ఎంఎం వర్షాలు కురవడం గమనార్హం.
జనవరిలో కూడా సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 6.8 ఎంఎం కాగా.. ఈ ఏడాది జనవరిలో 0.7 ఎంఎం మాత్రమే కురిసింది. మొత్తంగా దక్షిణ భారతదేశంలో 59 శాతం వర్షపాతం లోటు కాగా.. తెలంగాణలో మాత్రం ఈ లోటు 98 శాతం ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి మొదటి వారం నుంచే తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి.

ఇక కొద్ది రోజుల్లో మొదలు కానున్న వేసవి కాలంలో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతగా 12.6 డిగ్రీ సెల్సియస్ కొన్ని ప్రాంతాల్లో ఉంది.
అయితే, ఈ ఫిబ్రవరిలో పగటి పూట ఎండలు మండిపోతుండగా.. రాత్రి మాత్రం చల్లగానే ఉంటోంది. రంగారెడ్డిలో అత్యల్పంగా 12.6 డిగ్రీలు నమోదు కాగా.. వికారాబాద్‌లో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్‌లో 36.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండలు మండిపోనుండటంతో ప్రజలు బయటకు వచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications