గ్రూప్-1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట
గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయినట్లు తెలుస్తోంది. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉండనున్నట్లు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 9న గ్రూప్-1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటు జనరల్ ర్యాంకింగ్ సాధించిన అభ్యర్థి అప్పీల్ చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారణ జరిపిన సీజే అపరేష్ కుమార్ సింగ్ తో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు.
విచారణలో టీజీపీఎస్సీ వాదనలు:
హైకోర్టులో గ్రూప్-1 నియామకాలపై జరిగిన విచారణలో టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎ. సుదర్శన్ రెడ్డి (AG Sudarshan Reddy) తమ వాదనలను బలంగా వినిపించారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రూప్-1 నియామక ప్రక్రియ జరుగుతోందని, ఇంత కాలం తర్వాత జరుగుతున్న ఈ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసిందని ఆయన ధర్మాసనానికి తెలిపారు. సింగిల్ బెంచ్ తీర్పు తెలుగు అభ్యర్థుల పట్ల పక్షపాతం చూపించిందని ఆరు ఆరోపణల ఆధారంగా వెలువడిందని, అయితే ఈ ఆరోపణలకు ఎవరూ ఆధారాలు చూపించలేకపోయారని ఏజీ వాదించారు.
ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రశ్నలు:
ఏజీ వాదనలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే), ఈ నియామకాలపై మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ ఘటనలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించారు. అలాగే, నిబంధనలను ఉల్లంఘించారనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. దీనికి ఏజీ సమాధానమిస్తూ, కమిషన్ ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, పక్షపాతం చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఏపీ గ్రూప్-1 నియామకాలలో కూడా తెలుగు అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని ఉదాహరణగా చూపారు.
పరీక్షా కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్లపై వాదనలు:
పరీక్షా కేంద్రాల కేటాయింపుపై ఉన్న ఆరోపణలపై ఏజీ వివరణ ఇచ్చారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు మూత్రశాలలు లేకపోవడం వల్ల ఆ రెండు కేంద్రాలను కేవలం మహిళలకే కేటాయించామని చెప్పారు. అలాగే, దివ్యాంగులకు సమీపంలో ఉన్న కేంద్రాలను కేటాయించామని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని కూడా సింగిల్ బెంచ్ తప్పుపట్టిందని, ఇది కూడా ఆరోపణలలో ఒకటని ఏజీ కోర్టుకు వివరించారు.
కోర్టు స్పందన:
ఈ వాదనలను విన్న సీజే, పరీక్షా కేంద్రాల కేటాయింపును తప్పుపట్టలేమని, హాల్ టికెట్లు జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపిక కాని అభ్యర్థుల న్యాయవాదులు వాదిస్తూ, నిబంధనల ప్రకారం మూల్యాంకనం జరగలేదని ఆరోపించారు. దీనిపై సీజే స్పందిస్తూ, జవాబు పత్రాలను చూడకుండా మూల్యాంకనం సరిగ్గా జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
తదుపరి విచారణ వాయిదా:
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేంత వరకు నియామకాల ప్రక్రియపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ కేసులో తుది నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications