ఓటుకు నోటు, సెక్షన్ 8: టీడీపీ దాడి, గవర్నర్‌కు టీఆర్ఎస్ బాసట
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారంపై తాజాగా జరుగుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహాన్‌కు వివరిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు గవర్నర్ వ్యవహరిస్తున్న నరసింహాన్‌పై ఏపీ మంత్రులు విమర్శల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు.
ఓటుకు నోటు కేసు నుంచి బయపడేందుకు సహకరించడం లేదనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌పై ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. గతంలో ఇదే గవర్నర్‌ను కొనసాగించాలని టీడీపీ నేతలు కోరారని యాదవ రెడ్డి గుర్తు చేశారు. ఇరు ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబే గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.
గవర్నర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఏపీ మంత్రుల్ని వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామంటూ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావుల కిషోర్‌బాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.

గవర్నర్ నరసింహన్ రాజ్యాంగబద్దంగా పని చేయడం తమకు రుచించకపోవడంతో ఏపీ మంత్రులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేసే గవర్నర్‌ను బెదిరిస్తారా? అని వారిని సూటిగా ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్వవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో గవర్నర్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు.
ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకు్ననా లాభం లేకపోవడంతో కొత్తగా సెక్షన్ 8 అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీది కేవలం ప్రేక్షకపాత్రయేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ కేసులో గవర్నర్‌ని నిందించడం తగదని ఆయన తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీ మాట్లాడుతూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ - 8 అమలుపై ఏపీ సీఎంతో సహా మంత్రులు, టీడీపీ నాయకులు గందరగోళం లేవనెత్తుతున్నారని అన్నారు. సెక్షన్ 8 ద్వారా గవర్నర్‌కు అదనపు అధికారాలను దఖలుపరిచే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ప్రజల భద్రత కోసం, స్వేచ్ఛ కోసం, ఆస్తుల పరిరక్షణం కోసం మాత్రమేనని, కానీ చంద్రబాబు అవినీతికి పాల్పడేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజల భద్రత, స్వేచ్ఛ కోసం, అదుపు తప్పిన శాంతిభద్రతలను నియంత్రించడానికి గవర్నర్‌కు అదనపు అధికారాలు కల్పించేందుకు సెక్షన్-8 ఉద్దేశించబడిందని, కానీ ఈ సెక్షన్‌ను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడతామంటే కుదరదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత ఓవైసీ మండిపడ్డారు. 'ఏపీ సీఎంగా శాంతిభద్రతల అధికారాలు గవర్నర్‌కు అప్పగిస్తారా?. శాంతి భద్రతల అధికారాలు గవర్నర్‌కు అప్పగించడాన్ని తెలంగాణ ప్రాంతంలోని మీ పార్టీ నేతలే వ్యతిరేకిస్తు్న్నారు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications