లోకేష్ బనకచర్లకు పోలవరంతో తెలంగాణ కౌంటర్..! మంత్రుల ఫైర్..!
ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అండతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ మంత్రులు ఇవాళ మండిపడ్డారు. ముఖ్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా బనకచర్ల ప్రాజెక్టును సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఫైర్ అయ్యారు. బనకచర్లపై ఏపీ పట్టుబడితే పోలవరంపై పోరుతో కౌంటర్ ఇస్తామనే సంకేతం ఇచ్చేశారు.
సముద్రంలో వృధాగా పోతున్న నీటితో ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పేముదంటూ ఏపీ సర్కార్ చేస్తున్న వాదనను తెలంగాణ మంత్రులు తప్పుబట్టారు. ఇవాళ కొల్లాపూర్ లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చని ఏపీ మంత్రులకు సూచించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ వారికి చురకలు అంటించారు.

మరోవైపు 2 లక్షల ఎకరాలు మునిగిపోకుండా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వానికి భట్టి విక్రమార్క సూచించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజల తరఫున పోరాడేందుకు సిద్దంగా ఉన్నట్లు భట్టి ప్రకటించారు. మంత్రి లోకేష్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు. మరోవైపు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం లోకేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బనకచర్లపై మంత్రి లోకేష్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి కాబట్టి లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పొత్తులు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరని ఉత్తమ్ లోకేష్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. వందకు వంద శాతం బనకచర్ల అక్రమ ప్రాజెక్టు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications