రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ: చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని బుధవారం ఉదయం తెలంగాణ మంత్రులు ప్రత్యేకంగా కలిశారు. మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, చందులాల్‌లు చంద్రబాబుని కలిసిన వారిలో ఉన్నారు.
ఈరోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన మంత్రులు ఆయనతో సుమారు అరగంట పాటు చర్చించారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం చంద్రబాబు లోపలికి తీసుకెళ్లారు. కాగా ఈ సమావేశంలో వరంగల్ జిల్లాలో రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు సహకరించాలని ఈసందర్భంగా మంత్రులు ఆయన్ని కోరినట్టు తెలుస్తోంది.
రేయాన్ ఫ్యాక్టరీకి సంబంధించి ముడిసరుకును ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ నుంచి ముడిసరుకు సరఫరాపై పన్ను తగ్గించాలని మంత్రులు ఆయన్ని కోరారు. ఏపీ తరఫున కూడా కొన్ని నిధులివ్వాలని చంద్రబాబును కడియం శ్రీహరి కోరగా, అందుకు బాబు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

కాగా, డిసెంబర్ రెండో వారంలో రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం నిధులు కేటాయించడానికి సీఎం కేసీఆర్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం తొలి విడతలో భాగంగా రూ. 30 కోట్లు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications