మహారాష్ట్రలో తెలంగాణ మోడల్.!ఔరంగబాద్ లో భారీ బహిరంగ సభ.!కేసీఆర్ దిశానిర్ధేశం.!
ఔరంగబాద్/హైదరాబాద్ : జాతీయ స్థాయిలో బలోపేతం దిశగా బీఆర్ఎస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్ర పై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నెల 24 ఔరంగబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ఔరంగబాద్ జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో పల్లెపల్లెలో "తెలంగాణ మోడల్" గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేసారు. తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రధాలను ప్రారంభించారు.
ఔరంగబాద్ జిల్లాలో పల్లె పల్లెకూ "తెలంగాణ మోడల్":మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) జిల్లా పరిధిలో గల ఔరంగబాద్ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్, వైజాపూర్, కన్నాడ్, గంగాపూర్, కొలంబర్ తదితర అన్ని నియోజకవర్గాల్లో ప్రచార రథాల ద్వారా అన్ని గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ రూపురేఖలు మార్చిన 450 స్కీముల విశిష్టత గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేలా అన్ని గ్రామాలకు ప్రచార రధాలు పంపాలన్నారు చంద్రశేఖర్ రావు. తొమ్మిది విడతలలో రైతుబంధు పథకం కింద 62 లక్షల మంది రైతుల ఖాతాలలోకి 80వేల కోట్ల రూపాయల బదిలీ వెనక ఉన్న చిత్తశుద్ది నార్త్ ఇండియన్స్ కు తెలియజేయాలన్నారు గులాబీ దళపతి.

24న బహిరంగ సభ.. కేసీఆర్ దిశానిర్ధేశం:అంతే కాకుండా 40వేల కోట్ల రూపాయల వ్యయంతో వ్యవసాయ రంగానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని, రైతులకు 17,351 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిన అంశాన్ని కూడా మహారాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు చంద్రశేఖర్ రావు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష 19 వేల కోట్ల రూపాయలతో 660.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, ఇది తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు చంద్రశేఖర్ రావు.5 వేల కోట్ల రూపాయలతో రైతుభీమా పథకం అమలు జరుగుతోందన్నారు గులాబీ బాస్.

450 స్కీములను వివరించేలా అన్ని గ్రామాలకు ప్రచార రధాలు: అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రచార రధాలను తిప్పుతున్నట్టు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 24వ తేదీన ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్)లోని జబిందా మైదానంలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతానికి పెద్ద ఎత్తున చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రచార రధాలను గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో జీవన్ రెడ్డి ప్రారంభించారు.

పల్లెలన్నీ గులాబీ మయం కావాలి.. ఔరంగబాద్ సభను జయప్రదం చేయాలి: దీంతో పాటు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాహారం తెలంగాణ మోడల్ ను వివరించే వాల్ పోస్టర్లను కూడా జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. మహారాష్ట్ర పల్లెలన్నీ గులాబీ మయం కావాలని సీఎం ఆకాంక్షించినట్టు తెలిపారు జీవన్ రెడ్డి.
పల్లెలన్నీ కదిలి ఔరంగబాద్ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్,ఐడిసి ఛైర్మన్ వేణుగోపాల చారీ, బిఆర్ఎస్ పార్టీ మహరాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న ఢోంగే, యువ నాయకులు అంకిత్, శివాంక్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications