మరో ఎన్నికల నగారాకు సిద్ధమవుతున్న తెలంగాణా సర్కార్.. ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల సమరానికి సై అంటుంది. తెలంగాణా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ వంటి ప్రధాన సంస్థలకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణా సర్కార్
ఇంతకు ముందు ఫిబ్రవరి 2026లో 123 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు జరిగాయి. అయితే జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం తదితర కొన్ని కార్పొరేషన్లు, కొన్ని మున్సిపాలిటీలు ఆ దశలో చేరలేదు. ఓటరు జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఎస్‌ఐఆర్ పూర్తయి కొత్త ఓటరు జాబితాలు ఖరారైన తర్వాత డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆ మేరకు సమాయత్తం అవుతుంది తెలంగాణా ప్రభుత్వం.

ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ కార్పొరేషన్లలో విజయం సాధించాలని కోరుకుంటోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అదే తరహాలో మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తోంది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు వంటి అంశాలపై కోర్టు కేసులు కొనసాగుతున్నాయి.
డిసెంబర్ లో ఎన్నికలకు రెడీ అవుతున్న తెలంగాణా సర్కార్
అయినా ప్రభుత్వం ఎన్నికల సన్నాహాల్లో మునిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, సంవత్సరాంతానికి ఎన్నికలు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది.
ఈ ఎన్నికలు హైదరాబాద్ పరిధిలోని పట్టణ పాలనను బలోపేతం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు కొత్త ఉత్సాహం కలిగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా జీహెచ్ఎంసీ , పెండింగ్ మున్సిపల్ ఎన్నికలు
మిగతా చోట్ల కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి పార్టీ పట్టు ప్రజల్లో ఎంత ఉందో తెలుసుకొని, తదనుగుణంగా భవిష్యత్ ఎన్నికల ప్లాన్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి జరగనున్న జీహెచ్ఎంసీ సహా పెండింగ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.













Click it and Unblock the Notifications