బాబు 'అమరావతి' ఆదేశం: కళ్లు మూసుకోవద్దు.. కేసీఆర్‌ను లాగారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన మూడు, నాలుగో తరగతి ఉద్యోగుల నిరసన కార్యక్రమం శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు మూడు, నాలుగో తరగతి ఉద్యోగులు ఏపీకి కేటాయించబడ్డారు. అదే సమయంలో ఇప్పుడు అమరావతికి రావాల్సిందేనని ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

తమ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా భోజన విరామం సమయంలో నిరసన తెలుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉందని చెబుతు వారు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
కాగా, జూన్ 27వ తేదీలోగా హైదరాబాదులోని ప్రభుత్వ ఉద్యోగులు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కొందరు వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేయగా, మరికొందరు మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నేటివిటీ ఉద్యోగులు మాత్రం తమను ఏపీ రిలీవ్ చేయాలని, తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications