పెన్షన్ లబ్దిదారులకు తీపికబురు: పెన్షన్ రూ.4000కు పెంచే యోచన!
తెలంగాణలో లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు చేయూత పథకం ద్వారా ప్రతి నెలా సామాజిక పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ పెన్షన్ మొత్తం రూ.2,000గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు దీనిని రూ.4,000కు పెంచుతామని స్పష్టంగా హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా ఈ విషయం వెల్లడించింది. అధికారంలోకి వచ్చి చాలా నెలలు గడిచినా ఇంకా పెంపు జరగలేదు కాబట్టి లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల నల్గొండ జిల్లా ఏచూరి గార్డెన్స్‌లో కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్లను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం రూ.2,000గా ఉన్న పెన్షన్‌ను త్వరలోనే రూ.4,000కు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను అనుసరిస్తూ సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతున్నామని ఆయన అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకుని ఉన్నప్పటికీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పుల్లో ఇప్పటికే 95 వేల కోట్ల రూపాయలు చెల్లించామని, అయినా కూడా పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి ఇతర సంక్షేమ పథకాల గురించి కూడా ప్రస్తావించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, దీనికి ఇప్పటికే రూ.13 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన బియ్యం నాణ్యత తక్కువగా ఉండేదని గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ఆర్థిక సాయంతో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
చేయూత పెన్షన్ పెంపు జరిగితే లక్షలాది కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక మద్దతు లభిస్తుంది. ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వం ఈ హామీని త్వరలోనే అమలు చేస్తుందని లబ్ధిదారులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తి పేద ప్రజల్లో ఆశాజనక వాతావరణం సృష్టిస్తోంది.













Click it and Unblock the Notifications
