వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రేకింగ్‌! తెలంగాణ పోలీసుల‌పై రాజ‌స్థాన్‌లో ప్రాణాంత‌క దాడి: పిల్ల‌ల దొంగ‌ల‌నుకున్నార‌ట‌!

|
Google Oneindia TeluguNews

వరంగల్/ జైపూర్: తెలంగాణ పోలీసుల‌పై రాజ‌స్థాన్‌లో దాడి చేశారు కొంద‌రు స్థానికులు. మామూలు దాడి కాదు. ప్రాణాంత‌క దాడి. ప్రాణాలు హ‌రించేలా కొట్టారు కొంద‌రు గ్రామీణులు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన తెలంగాణ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆ రాష్ట్రంలోనే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ పోలీసుల కారును ధ్వంసం చేశారు. అద్దాల‌ను ప‌గుల గొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు ఎస్ఐ స‌హా ముగ్గురు కానిస్టేబుళ్లు గాయ‌ప‌డ్డారు. ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా నిందితుల‌ను అరెస్టు చేయ‌డానికి పోలీసులు రాజ‌స్థాన్‌కు వెళ్ల‌గా.. స్థానికులు ఏక‌మై వారిపై దాడి చేశారు. ముష్టిఘాతాలు కురిపించారు.

పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లడానికి వ‌చ్చిన ముఠాగా అనుమానించి, పోలీసుల‌ను చిత‌గ్గొట్టారు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఏకంగా 25 మందిని అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌స్థాన్‌లోని భిల్వారా జిల్లా గులాబ్‌పూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని బ‌రాతియా గ్రామంలో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కేంద్ర బిందువు.. సుబేదారీ..

కేంద్ర బిందువు.. సుబేదారీ..

వ‌రంగల్‌లోని సుబేదారి ప్రాంతంలో కొద్దిరోజులుగా వ‌రుస‌గా చోరీ ఘ‌ట‌న‌లు న‌మోద‌య్యాయి. ఈ వ‌రుస చోరీల్లో రాజస్థాన్ నుంచి వ‌చ్చిన ముఠా ప్ర‌మేయం ఉన్న‌ట్లు సుబేదారి పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. అనుమానితుల కాల్ డేటాల‌ను ప‌రిశీలించ‌గా.. వారు రాజ‌స్థానీయుల‌ని తేలింది. భిల్వారా జిల్లాలోని ఫూలియా క‌లాన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పాలోలా గ్రామానికి చెందిన నౌర‌త బ‌గారియా అనే వ్య‌క్తి ఈ ముఠా సూత్ర‌ధారి అనుమానించారు సుబేదారీ పోలీసులు.

అయిదుమందితో ప్ర‌త్యేక బృందం..

అయిదుమందితో ప్ర‌త్యేక బృందం..

ఈ నేప‌థ్యంలో.. వ‌రంగ‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ డేవిడ్ రాజ్‌, ఎస్ఐ శివ‌శంక‌ర్, కానిస్టేబుల్ రాజ‌శేఖ‌ర్‌ల‌తో ఓ ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురితో పాటు మ‌రో ఇద్ద‌రు కానిస్టేబుళ్లు స‌హా మొత్తం అయిదుమంది రాజ‌స్థాన్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. జైపూర్‌లో దిగిన త‌రువాత తెలంగాణ పోలీసులు ఓ త‌వేరా కారును అద్దెకు మాట్లాడుకున్నారు. ఆ కారులో వారు మొద‌ట ఫూలియా క‌లాన్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. స్థానిక కానిస్టేబుల్ శంభుసింగ్‌ను వెంటబెట్టుకుని రెండు వాహ‌నాల్లో తెలంగాణ పోలీసులు పాలోలా గ్రామానికి వెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌రువాత సురేష్ బ‌గారియా గురించి ఆరా తీశారు. అదే గ్రామానికి చెందిన కొంద‌రు యువ‌కుల‌ను విచారించారు. సురేష్ బ‌రాటియా గ్రామంలోని త‌న సోద‌రి ఇంటికి వెళ్లిన‌ట్లు వారు తెలిపారు.

క‌థ అడ్డం తిరిగింది ఇక్క‌డే..

క‌థ అడ్డం తిరిగింది ఇక్క‌డే..

దీనితో తెలంగాణ పోలీసులు బ‌రాటియా గ్రామానికి వెళ్లారు. అక్క‌డ కూడా సురేష్ వారి చేతికి చిక్క‌లేదు. అయితే- స్థానిక పోలీస్ శంభు సింగ్ ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం.. సురేష్ స‌మీప బంధువు, ఈ చోరీల సూత్ర‌ధారిగా భావిస్తోన్న రామ్‌క‌ర‌ణ్ బ‌గారియాను అదుపులోకి తీసుకున్నారు. అత‌ణ్ని ప‌ట్టుకొచ్చి, త‌వేరాలో కూర్చోబెట్టారు. అక్క‌డే క‌థ అడ్డం తిరిగింది. స్థానికంగా బ‌గారియా క‌మ్యూనిటీ బ‌ల‌మైన‌ది. త‌మ కులానికి చెందిన వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అదుపులోకి తీసుకోవ‌డంతో స్థానిక మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ప్ర‌తిఘ‌టించారు. గొడ‌వ ప‌డ్డారు. హ‌ల్‌చ‌ల్ చేశారు. పోలీసులు అని తెలిసిన త‌రువాత కూడా ఆ మ‌హిళ‌లు..తెలియ‌న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారు. ఫోన్ల ద్వారా స‌మాచారాన్ని త‌మ బంధువులంద‌రికీ తెలియ‌జేశారు.

సివిల్ డ్రెస్‌లో పోలీసులు..

సివిల్ డ్రెస్‌లో పోలీసులు..

పాలోలా, బ‌రాటియా గ్రామాల్లో బ‌గారియా కులం పెత్త‌నం చలాయిస్తోంది. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్య‌లో ఈ రెండు చోట్ల నివ‌సిస్తున్నారు. పైగా మ‌హిళ‌లు స‌మాచారం ఇవ్వ‌డం, పెద్ద ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో గ్రామ‌స్తులంద‌రూ ఏకం అయ్యారు. తెలంగాణ పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. దీనితో వారంతా పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానించారు. దాడి చేశారు. చుట్టు ముట్టి చిత‌గ్గొట్టేశారు. ఈ దాడిలో ఎస్ఐ శివ‌శంక‌ర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారి వెంట ఉన్న స్థానిక పోలీసు శంభూసింగ్ ఫూలియా క‌లాన్ పోలీస్ స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గ్రామీణుల నుంచి తెలంగాణ పోలీసుల‌ను విడిపించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన శివ‌శంక‌ర్‌ను భిల్వారాలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న అక్క‌డ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డేవిడ్ రాజ్‌, రాజ‌శేఖ‌ర్‌, మ‌రో ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌కు స్థానికంగా చికిత్స అందించారు.

భాష రాక‌.. వీళ్లు చెప్పేది వారికి అర్థం కాక‌..

భాష రాక‌.. వీళ్లు చెప్పేది వారికి అర్థం కాక‌..

సాధార‌ణంగా తెలంగాణ పోలీసులు హిందీని ధారాళంగా మాట్లాడ‌గ‌ల‌రు. సంఘ‌ట‌న చోటు చేసుకున్న ప్రాంతం మారుమూల గ్రామం కావ‌డం, తెలంగాణ పోలీసుల హిందీని వారు స‌రిగ్గా అర్థం చేసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ దాడి చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ కులానికి చెందిన వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఎత్తుకెళ్తున్నార‌నే అనుమానంతో దాడి చేయ‌డం, ఆ స‌మ‌యంలో ఎదుటి వారు ఏం చెబుతున్న‌దీ ఆ గ్రామీణులు ప‌ట్టించుకోక‌పోవడం.. ఇవ‌న్నీ దాడికి కార‌ణాల‌య్యాయి.

25 మంది అదుపులో..

25 మంది అదుపులో..

ఈ ఘ‌ట‌న‌లో బ‌గాతియా గ్రామానికి చెందిన 25 మంది గ్రామీణుల‌ను ఫూలియా క‌లాన్ పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నారు. మ‌రికొంద‌రి కోసం అన్వేషిస్తున్నారు. దాడికి గ‌ల అస‌లు కార‌ణాల‌పై ఆరా తీస్తున్నామ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌నకు ప్ర‌త్య‌క్ష సాక్షి శంభూసింగ్ నుంచి మ‌రింత స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన సురేష్, రామ్‌క‌ర‌ణ్ బగారియాల‌ను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన వారి కోసం విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

English summary
A team of Telangana Police was attacked by some villagers here attempting to nab an accused from a village of the District. The Telangana Police team was in the district on Sunday to nab an accused miscreant and while it was conducting searches in Baratia village of Gulabpur region, it was attacked by some villagers. Sub Inspector Shiva Kumar and three constables were injured in the attack. The seriously injured SI was referred to Bhilwara hosital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X