విద్యాసంస్థల బంద్ పై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం
తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు చేపట్టిన నిరవధిక బంద్‌కు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఆయా కళాశాలల యాజమాన్యాలు బంద్ ను విరమించుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలలో 600 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన 600 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా దీపావళిలోగా అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో బంద్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.
సోమవారం ప్రారంభమైన ఈ నిరవధిక సమ్మ.. రాత్రి నాటికి ముగిసినట్టయింది. నేటి నుంచి ఆయా కళాశాలలు, విద్యాసంస్థలన్నీ కూడా యధావిధిగా పని చేయనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ కళాశాలలు, విద్యాసంస్థల యజమానులు, ప్రతినిధులతో ఏర్పాటైన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్యతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విద్యాశాఖ అధికారులు.. సోమవారం రోజంతా చర్చలు జరిపారు.

ప్రైవేటు కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మొత్తం 8,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ. 1,207 కోట్ల టోకెన్లు జారీ అయినప్పటికీ, ఆ మొత్తాన్ని విడుదల చేయలేదు. దీన్ని వెంటనే విడుదల చేయాలంటూ విద్యాసంస్థల సమాఖ్య ఈ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
మంత్రుల కమిటీతో సమావేశం సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన 1,207 కోట్ల రూపాయల గురించి ప్రస్తావించారు. ఈ మొత్తంలో 700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం
లో ప్రైవేటు ప్రొఫెషనల్ కళాశాలలకు రూ. 500 కోట్లు, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు రూ. 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి.
చర్చల అనంతరం ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా విడుదల చేయడానికి అంగీకరించింది. మిగిలిన 600 కోట్ల రూపాయలను దీపావళికి నాటికి విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ రూ.600 కోట్లు ఇప్పటికే జనరేట్ అయిన టోకెన్‌లకు సంబంధించినవని, భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా చెల్లింపులను క్రమబద్ధీకరిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications