తెలంగాణా రాష్ట్రానికి మేఘ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు!
తెలంగాణ రాష్ట్రానికి వర్ష హెచ్చరిక చేస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి వంటి కొన్ని ప్రాంతాలలో ఈరోజు ఉదయం నుండి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ జిల్లాలలో ఓ మోస్తరు నుంచి విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం
నేడు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని కూడా పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు కురిసే సూచనలు
నేడు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదు కావచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వర్షాలు
మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 30డిగ్రీలు, కనిష్ఠ 23డిగ్రీలు ఉండవచ్చు. ఇప్పటికే నేడు హైదరాబాద్ లోని కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్, మసాబ్ ట్యాంక్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ విషయాలపై అప్రమత్తం
వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.అయితే ఈ వర్షాలను నమ్ముకుని ఇప్పుడు పంటల సాగు చెయ్యొద్దని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు చెయ్యాలని చెప్తున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications