ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ ఇచ్చిన ఉపరితల ద్రోణి!
మొన్నటిదాకా ఎల్నినో ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పుడు మళ్ళీ ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలకు అవకాశం ఏర్పడింది. ద్రోణి తరహా వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల తేమ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నేడు కరీంనగర్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో కూడా అక్కడక్కడా జల్లులు పడవచ్చు.

రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు
బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడుతున్నా, బంగాళాఖాతంలోని ఆవర్తనం వాయువ్య దిశగా కదలడంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో వాతావరణంలో తేమ 85 శాతం వరకు నమోదవుతోంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 60 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
నేడు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోనూ వర్షం
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఇప్పటికే జల్లులు కురుస్తున్నాయి. నేడు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఏది ఏమైనా మొన్నటి దాకా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ పుంజుకున్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో లోటు వర్షాన్ని కాస్త భర్తీ చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications