ఉరుములు మెరుపులతో వర్షాలు.. మేఘాలకు వరుణ సందేశం!
దసరా పండుగ సమీపించి అక్టోబర్ మాసం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. త్వరలోనే బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడనున్నాయని, అరేబియా సముద్రంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణిగా మారే అవకాశం ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది.
తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రెండు రోజులపాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.నేడు తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ జిల్లాలలో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను కూడా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, బి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాలలో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్ లోనూ వర్షాలు పడే ఛాన్స్
ఇక హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ 12వ తేదీ వరకు హైదరాబాద్ లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది . హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయనప్పటికీ వర్షాలు మాత్రం కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా
రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు గా నమోదు అవుతాయని వెల్లడించింది. ఇక గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పగలు మధ్యాహ్నం అంతా ఎండగా ఉండి సాయంత్రం జల్లులు పడే అవకాశం ఉందని ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉందని జిహెచ్ఎంసి అధికారులు సైతం చెబుతున్నారు.












Click it and Unblock the Notifications