Telangana Covid cases: రాష్ట్రంలో కొత్తగా 2070 కరోనా కేసులు-మరో 18 మంది మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది. కరోనాతో మరో 18 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3364కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,90,208 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో మరో 3762 మంది కరోనా నుంచి కోలుకోగా... ఇప్పటివరకూ మొత్తం 5,57,162 మంది రికవరీ అయ్యారు. కరోనా రికవరీ జాతీయ స్థాయిలో 93.3శాతం ఉండగా తెలంగాణలో 94.47శాతంగా ఉంది. కోవిడ్ మరణాల రేటు జాతీయ స్తాయిలో 1.2శాతం ఉండగా తెలంగాణలో 0.57శాతంగా ఉంది.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిపోవడంతో కరోనా మూడో వేవ్‌కు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మూడు వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా సీఎస్ సోమేష్‌కుమార్ హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి సందర్శించారు. నీలోఫర్ డాక్టర్లతో సమావేశమై... కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే చర్యలపై చర్చించారు. నీలోఫర్‌లో వెయ్యి పడకలకు అవకాశం ఉందని సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. అక్కడి పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేస్తున్నామని చెప్పారు.
కాగా,తెలంగాణలో గత 20 రోజులకు పైగా అమలవుతున్న లాక్‌డౌన్ సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోయిందని ఇటీవలే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస రావు వెల్లడించిన సంగతి తెలిసిందే.సాధారణంగా 5 శాతం కన్నా తక్కువ కోవిడ్ పాజిటివిటీ రేటు ఉంటే... లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో అది 2 శాతానికి పడిపోవడంతో... లాక్‌డౌన్ ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా ఇదే విషయం వెల్లడించారు. వచ్చే వారంలో కేసుల సంఖ్య తగ్గితే లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications