తెలంగాణ రికార్డు.. సైబర్ నేరాల్లో దేశంలోనే టాప్ !
దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సైబర్ నేరాల విషయంలో భారత్ లోనే టాప్ గా నిలిచి రికార్డు సృష్టించింది. నేర గణాంకాల ప్రకారం సైబర్ నేరాలలో తెలంగాణ రాష్ట్రం దేశ సగటుతో పోలిస్తే దాదాపు 10 రెట్లు అధిక క్రైమ్ రేటుతో అగ్రస్థానంలో నిలవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటు 4.8 శాతం కాగా, తెలంగాణలో ఇది 40.3 శాతంకి చేరింది.
దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ బూస్ట్..
దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయి. 40.3% తో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే.. 2వ స్థానంలో కర్ణాటక ఉంది . ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర (6.6%), ఆంధ్రప్రదేశ్ (4.4%), అసోం (4.9%), ఉత్తరప్రదేశ్, ఒడిశా (4.3% చొప్పున) ఉన్నాయి. కాగా పశ్చిమ బెంగాల్ కేవలం 0.4% క్రైమ్ రేటుతో అతి తక్కువ స్థాయిలో ఉంది.

కేంద్ర పాలిత ప్రాంతాల పరిస్థితి..
ఢిల్లీ - 3.2%
పుదుచ్చేరి - 3.9%
ఇవి కూడా సైబర్ నేరాలకు హాట్‌స్పాట్‌లుగా గుర్తించబడ్డాయి.
ఇక ఢిల్లీ పోలీసుల డేటా ప్రకారం 2024లో - రూ. 817 కోట్లు సైబర్ మోసాలకు బలయ్యారు. 2025లో జూన్ 30 నాటికి - మొదటి ఆరు నెలల్లోనే రూ. 70.64 కోట్లు నష్టం జరిగింది. తెలంగాణకు సంబంధించిన ఆర్థిక నష్టం గణాంకాలు అధికారికంగా ప్రకటించకపోయినా, నిపుణుల అంచనా ప్రకారం ఇది కూడా వందల కోట్లలోనే ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ.. 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) ఏర్పాటుచేశామని ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్' (cybercrime.gov.in) అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు రాష్ట్ర పోలీస్ విభాగాల్లో స్పెషల్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తూ.. ఫిషింగ్ కాల్స్, OTP ఫ్రాడ్స్, సోషల్ మీడియా హాకింగ్, బ్యాంకింగ్ మాల్వేర్ దాడులు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రజలు వ్యక్తిగత సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, యాప్స్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలు పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, సాంకేతిక నైపుణ్యాలతో నేరగాళ్లను గుర్తించడం, కఠిన చట్టాల అమలు చేసి ఈ సమస్యను నియంత్రించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications