ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కిరణ్ చంద్ర అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కిరణ్ చంద్ర ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కిరణ్ చంద్ర తన ఇద్దరు రూమ్ మేట్స్‌తో కలిసి మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు గదిలోనే ఉన్నాడని, వాళ్లిద్దరూ బయటకు వెళ్లిన సమయంలో ప్రాణాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆ తర్వాత రాత్రి 8.30 గంటల సమయంలో మిగితా ఇద్దరు విద్యార్థులు వచ్చి చూసేసరికి గది లోపలి నుంచి లాక్ చేసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు, భద్రతా సిబ్బంది కిరణ్ చంద్రను బీసీ రాయ్ టెక్నాలజీ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11.30 గంటల సమయంలో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విద్యా సంస్థలో ఏడాదిన్నర కాలంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. కాగా, కిరణ్ చంద్ర మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కిరణ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications