Telangana: రాచరిక ఆనవాళ్లు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం..!
డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మొదటగా విగ్రహ ఆవిష్కరణను సోనియా గాంధీతో చేయించాలనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద చేయించారు. ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
తెలంగాణ తల్లి విగ్రహం రూపులేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఆయన అన్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించారు. ఇందుకు సంబంధించి నమూనా కూడా విడుదల చేశారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అందురూ పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఈ కార్యక్రమానికి ప్రతి పక్షాలకు కూడా ఆహ్వానం పంపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా.. మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ఆహ్వానిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా ఆహ్వాన పత్రికలు అందించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం అపాయింట్ మెంట్ కోరుతున్నట్లు వివరించారు. వారు సమయమిచ్చిన మేరకు వారి వద్దకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి రూపం మార్చొద్దని కేటీఆర్ కోరారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక ఆనవాళ్లు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిసింది.
అయితే 2009 డిసెంబర్ 9న అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. అంతేకాకుండా ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు. అందుకే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.












Click it and Unblock the Notifications